The Bible Software
2 రాజులు · బైబిల్ (తెలుగు)

2 రాజులు 22

1యోషీయా ఏలడం ఆరంభించినప్పుడు, అతని వయసు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతు ఊరివాడైన అదాయా కూతురు.

2అతడు యెహోవా దృష్టిలో యథార్ధంగా నడుస్తూ, కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడు దావీదు చూపించిన దారిలో నడిచాడు.

3రాజైన యోషీయా పరిపాలనలో 18 వ సంవత్సరంలో, అతడు మెషుల్లాముకు పుట్టిన అజల్యా కొడుకూ, శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరానికి వెళ్ళమన్నాడు. రాజు అతనితో,

4“నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరికి వెళ్లి, ద్వారపాలకులు ప్రజల దగ్గర వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన డబ్బు మొత్తం ఎంతో లెక్క చూడమని అతనితో చెప్పు.

5యెహోవా మందిరపు పనికి అధికారులుగా ఉండి పని జరిగించేవాళ్ళ చేతికి ఆ డబ్బు అప్పగించాలి. ఆ తరువాత యెహోవా మందిరంలో శిథిలమైన స్థలాలను బాగుచేయడానికి యెహోవా మందిరపు పనిచేసే కూలివాళ్లకు వారు ఆ డబ్బు ఇవ్వాలి.

6వడ్రంగి వాళ్ళకూ, శిల్పకారులకూ, తాపీ పని వాళ్ళకూ, మందిరాన్ని బాగు చెయ్యడానికి మానులు, చెక్కిన రాళ్ళు కొనడానికి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పు” అన్నాడు.

7ఆ అధికారులు నమ్మకస్థులు గనుక వాళ్ళ చేతికి అప్పగించిన డబ్బు గురించి వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవలసిన పని లేదు.

8అప్పుడు, ప్రధానయాజకుడైన హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథాన్ని, షాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి

9రాజు దగ్గరికి తిరిగి వచ్చి “మీ సేవకులు మందిరంలో దొరికిన డబ్బు సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులుగా ఉండి, పని జరిగించేవాళ్ళ చేతికి అప్పగించారు” అని వార్త చెప్పి,

10“యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించాడు” అని రాజుతో చెప్పి ఆ గ్రంథం రాజు సముఖంలో చదివాడు.

11రాజు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.

12తరువాత రాజు యాజకుడైన హిల్కీయా, షాఫాను కొడుకు అహీకాము, మీకాయా కొడుకు అక్బోరు అనే వాళ్ళనూ, షాఫాను అనే శాస్త్రినీ, అశాయా అనే రాజసేవకుల్లో ఒకణ్ణి పిలిచి వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు.

13“మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలోని మాటలను గురించి నా విషయంలో, ప్రజల విషయంలో, యూదా వాళ్ళందరి విషయంలో, యెహోవాను అడగండి. మన పూర్వికులు తమ విషయంలో రాసి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యకుండా ఈ గ్రంథపు మాటలు వినలేదు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత ఎక్కువగా మండుతూ ఉంది” అన్నాడు.

14కాబట్టి యాజకుడైన + 22:14 యాజకుడైన రాజు హిల్కీయా, అహికాము, అక్బోరు, షాఫాను, అశాయా, స్త్రీ ప్రవక్త హుల్దా దగ్గరికి వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారి అయిన హర్హషుకు పుట్టిన తిక్వా కొడుకు షల్లూము భార్య. ఈమె యెరూషలేములో రెండో భాగంలో కాపురం ఉంది. ఈమె దగ్గరికి వారు వచ్చి మాటలాడారు.

15ఆమె వాళ్ళతో “మిమ్మల్ని నా దగ్గరికి పంపిన వానితో ఈ మాట చెప్పండి.

16యెహోవా చెప్పేదేమంటే, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాసి ఉన్న కీడంతా, ఏదీ విడిచి పెట్టకుండా నేను ఈ స్థలం మీదకీ, దాని పౌరుల మీదకీ రప్పిస్తాను.

17ఈ ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ చేసిన ప్రతి పనీ నాకు కోపం పుట్టించింది గనుక నా కోపం ఆరిపోకుండా, ఈ స్థలం మీద రగులుకుంటుంది.

18యెహోవాను సంప్రదించడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియపరచండి.

19ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి, నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను.

20నేను నిన్ను నీ పితరుల దగ్గరికి చేరుస్తాను. నీవు ప్రశాంతంగా సమాధికి వెళ్తావు. నేను ఈ స్థలం మీదకి రప్పించే కీడును నీవు నీ కళ్ళతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు” అని చెప్పింది. అప్పుడు, వారు ఈ వార్త రాజు దగ్గరికి తెచ్చారు.

← 2 రాజులు 21Read In The App, Free →2 రాజులు 23 →

Study 2 రాజులు 22

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425