The Bible Software
యెహెజ్కేలు · బైబిల్ (తెలుగు)

యెహెజ్కేలు 10

1అప్పుడు నేను కెరూబుల తలలకి పైగా ఉన్న గుమ్మటం వైపుకి చూశాను. వాళ్లకి పైగా అది నీలమణిలా మెరుస్తూ కనిపించింది. అది ఒక సింహాసనం ఆకారంలో ఉంది.

2అప్పుడు యెహోవా నార బట్టలు వేసుకున్న వ్యక్తితో ఇలా చెప్పాడు. “నువ్వు చక్రాల మధ్యకు, కెరూబుల కిందకు వెళ్ళు. కెరూబుల మధ్యలో ఉన్న నిప్పు కణికలతో రెండు చేతులూ నింపుకో. వాటిని పట్టణంలో వెదజల్లు.” నేను చూస్తుండగా ఆ వ్యక్తి వెళ్ళాడు.

3అతడు లోపలికి వెళ్ళినప్పుడు కెరూబులు మందిరం కుడివైపున నిలబడి ఉన్నారు. లోపలి ఆవరణను మేఘం కమ్మివేసింది.

4యెహోవా మహిమ తేజస్సు కెరూబుల పైనుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గర నిలిచింది. దాంతో మేఘం మందిరాన్ని నింపివేసింది. ఆవరణ అంతా యెహోవా మహిమ తేజస్సుతో వెలిగి పోతూ ఉంది.

5అప్పుడు బయట ఆవరణలో కెరూబుల రెక్కల చప్పుడు వినబడింది. అది సర్వశక్తిగల దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరంలా ఉంది.

6అప్పుడు నార బట్టలు వేసుకున్న వ్యక్తిని ఇలా ఆదేశించాడు. “కెరూబుల మధ్యలో ఉన్న చక్రాల దగ్గర ఉన్న అగ్నిని తీసుకో.” అప్పుడు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఒక చక్రం పక్కనే నిలబడ్డాడు.

7కెరూబుల్లో ఒకడు కెరూబుల మధ్య ఉన్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి నార బట్టలు వేసుకున్న వ్యక్తి చేతుల్లో ఉంచాడు. ఆ వ్యక్తి అగ్నిని చేతుల్లోకి తీసుకుని బయటకి వెళ్ళాడు.

8అప్పుడే కెరూబుల రెక్కల కింద మనిషి హస్తం లాంటిది నాకు కనిపించింది.

9నేను ఇంకా చూస్తూ ఉన్నాను. కెరూబుల దగ్గర నాలుగు చక్రాలున్నాయి. ఒక్కో కెరూబు దగ్గర ఒక్కో చక్రం ఉంది. ఆ చక్రాలు వైఢూర్యంతో చేసినట్టుగా ఉన్నాయి.

10ఆ నాలుగు చక్రాలు ఒకే విధంగా ఉన్నాయి. అవి ఒక చక్రంలో మరో చక్రం అమర్చినట్టుగా ఉన్నాయి.

11అవి కదులుతూ ఉన్నప్పుడు అన్ని వైపులకీ వెళ్తున్నట్టుంది. అవి ఏ పక్కకీ తిరగడం లేదు. అవి కెరూబుల ముఖాలు ఏ వైపుకి ఉన్నాయో ఆ వైపుకే వెళ్తున్నాయి. అవి పక్కకి తిరగకుండా ముందుకే వెళ్తున్నాయి.

12ఆ నాలుగు కెరూబుల వీపులూ, చేతులూ, రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్ళు ఉన్నాయి. నాలుగు చక్రాలు కూడా కళ్ళతో చుట్టూ కప్పి ఉన్నాయి.

13నేను వింటుండగా “చక్ర భ్రమణం” అని వాటిని పిలిచినట్టు విన్నాను.

14ఒక్కో కెరూబుకీ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబులా ఉంది. రెండోది మనిషిలా ఉంది. మూడో ముఖం సింహంలా ఉంది. నాలుగోది డేగ ముఖంలా ఉంది.

15అప్పుడు ఈ కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నాకు కనబడిన జీవులు ఇవే.

16కెరూబులు కదిలినప్పుడల్లా చక్రాలు కూడా వాటితోనే కదిలాయి. కెరూబులు భూమి పైనుండి ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు చక్రాలు తిరగలేదు.

17కెరూబులు నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. కెరూబులు లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి. ఎందుకంటే ఆ జీవుల ప్రాణం చక్రాల్లో ఉంది.

18అప్పుడు యెహోవా మహిమ తేజస్సు మందిరం గడప నుండి లేచి కెరూబులకు పైగా వెళ్ళి ఆగింది.

19కెరూబులు నేను చూస్తుండగా తమ రెక్కలు అల్లార్చి బయటకు వెళ్ళాయి. వాటితో పాటు చక్రాలు కూడా వాటి పక్కనే పైకి లేచాయి. అవి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గర నిలిచాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా వచ్చి నిలిచింది.

20కెబారు నది దగ్గర ఇశ్రాయేలు ప్రజల దేవుని కింద నాకు కనబడిన జీవులు ఇవే. అవి కెరూబులని నేను తెలుసుకున్నాను!

21ఒక్కో దానికి నాలుగు ముఖాలూ నాలుగు రెక్కలూ ఆ రెక్కల కింద మనిషి చేతుల్లాంటివీ ఉన్నాయి.

22వాళ్ళ ముఖాలు కెబారు నది దగ్గర నాకు కలిగిన దర్శనంలో నేను చూసిన రూపాల్లాగే ఉన్నాయి. అవి అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.

← యెహెజ్కేలు 9Read In The App, Free →యెహెజ్కేలు 11 →

Study యెహెజ్కేలు 10

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748