The Bible Software
న్యాయా · బైబిల్ (తెలుగు)

న్యాయా 13

1ఇశ్రాయేలు ప్రజలు మరోసారి యెహోవా దృష్టిలో దోషులయ్యారు. కాబట్టి ఆయన వారిని ఒక నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. 1 సంసోను పుట్టుక

2ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.

3యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు “చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు

4ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు.

5నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ + 13:5 నాజీర్ సంఖ్య. 6 చూడండి గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు.”

6అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరికి వచ్చి “దేవుని మనిషి ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన రూపం ఒక దేవదూతలా, భయం పుట్టించేది గా ఉంది. ఆయన ఎక్కడ్నించి వచ్చాడో నేను అడగలేదు. తన పేరేమిటో ఆయన నాకు చెప్పలేదు.

7ఆయన నాతో, ‘చూడు నువ్వు గర్భవతివి అవుతావు. కొడుకుని కంటావు. కాబట్టి నువ్వు ద్రాక్షారసాన్ని గానీ, మద్యాన్ని గానీ తాగకు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రమని చెప్పిన దేనినీ తినకు. ఎందుకంటే నీ బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేంత వరకూ దేవుని కోసం నాజీర్ గా ఉంటాడు’ అని చెప్పాడు” అంది.

8అప్పుడు మనోహ “నా ప్రభూ, పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలో మాకు నేర్పించడానికి నువ్వు పంపిన ఆ దేవుని మనిషి మరోసారి మా దగ్గరికి వచ్చేట్లుగా చెయ్యి” అని యెహోవాకు ప్రార్థన చేసాడు.

9దేవుడు మనోహ ప్రార్థన విన్నాడు. ఆ స్త్రీ పొలంలో కూర్చుని ఉన్నప్పుడు దేవుని దూత ఆమెకు కన్పించాడు.

10అప్పుడు ఆమె భర్త మనోహ ఆమె దగ్గర లేడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి “ఆ రోజు నాకు కన్పించిన వ్యక్తి మళ్ళీ కన్పించాడు” అని చెప్పింది.

11అప్పుడు మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. “నా భార్యతో మాట్లాడింది నువ్వేనా” అని అడిగాడు. అందుకా వ్యక్తి “నేనే” అన్నాడు.

12అప్పుడు మానోహ “నీ మాట ప్రకారమే జరుగుతుంది గాక. ఆ బిడ్డ కోసం పాటించాల్సిన నియమాలేమిటో ఆ బిడ్డ ఏమవుతాడో మాకు తెలియ చేయండి” అన్నాడు.

13అందుకు జవాబుగా యెహోవా దూత “నేను ఆ స్త్రీకి చెప్పినదంతా ఆమె జాగ్రత్తగా చేయాలి. ఆమె ద్రాక్ష నుండి వచ్చేది ఏదీ తినకూడదు,

14ఆమె ద్రాక్షారసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకూడదు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రంగా చెప్పిన దేనినీ తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె పాటించాలి” అని మనోహకు చెప్పాడు.

15అప్పుడు మనోహ “మేము నీ కోసం ఒక మేకపిల్లను పట్టుకుని వంట చేసే వరకూ ఆగమని మనవి చేస్తున్నాను” అని యెహోవా దూతతో అన్నాడు.

16దానికి యెహోవా దూత మనోహ “నేను ఆగినా నీ భోజనాన్ని మాత్రం ఆరగించను. ఒక వేళ నువ్వు దహన బలి అర్పించాలనుకుంటే దాన్ని యెహోవాకు అర్పించాలి” అన్నాడు. ఆయన యెహోవా దూత అని మనోహకు తెలియలేదు.

17మనోహ “నువ్వు చెప్పిన ప్రకారం జరిగిన తరువాత నిన్ను సన్మానించాలి గదా, మరి నీ పేరు ఏమిటి?” అని అడిగాడు.

18దానికి యెహోవా దూత “నా పేరెందుకు అడుగుతున్నావు? అది ఆశ్చర్యకరం” అన్నాడు.

19అప్పుడు మనోహ కొంత ధాన్యం తో పాటు ఒక మేకపిల్లను అక్కడ ఒక రాయి మీద యెహోవాకు బలిగా అర్పించాడు. మనోహా అతని భార్యా చూస్తుండగా యెహోవా దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు.

20అదేమిటంటే బలిపీఠం నుండి జ్వాలలు ఆకాశానికి లేస్తుండగా ఆ జ్వాలలతోబాటు పరలోకానికి ఆరోహణం అయ్యాడు. మనోహ అతని భార్యా అది చూసి నేలపై పడి నమస్కారం చేసారు.

21ఆ తరువాత యెహోవా దూత మళ్ళీ వారికి ప్రత్యక్షం కాలేదు.

22మనోహ తన భార్యతో “మనం దేవుణ్ణి చూశాం కాబట్టి కచ్చితంగా చనిపోతాం” అన్నాడు.

23కానీ అతని భార్య “యెహోవా మనలను చంపాలనుకుంటే మనం అర్పించిన దహనబలినీ ధాన్యపు నైవేద్యాన్నీ అంగీకరించి ఉండేవాడు కాదు. ఈ విషయాలను మనకు చూపించి ఉండేవాడూ కాదు. ఈ రోజుల్లో ఇలాంటి సంగతులను మనకు చెప్పేవాడూ కాదు,” అంది.

24తరువాత ఆ స్త్రీ ఒక కొడుకుని కన్నది. అతనికి సంసోను అనే పేరు పెట్టింది. ఆ పిల్లవాడు పెద్దయ్యాక యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు.

25ఇక అతడు జొర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న మహనెదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతణ్ణి పురికొల్పడం మొదలు పెట్టాడు.

← న్యాయా 12Read In The App, Free →న్యాయా 14 →

Study న్యాయా 13

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021